Sunday, January 2, 2011

తను వెళ్ళిపోయింది

తను వెళ్ళిపోయింది
నా జీవితంలో వసంతాలను తీసుకువచ్చిన తను నాకు అందనంత దూర తీరాలకు వెళ్ళిపోయింది.ఇక నుండి నేను ఎవరిని సంతోషపరచడానికి బ్రతకాలి.. ఈ ముప్పది సంవత్సరాల సహజీవనంలో ఏ రోజు తను లేకుండా నేను లేను.. నా సంతోష దు:ఖాలలో, నా కష్ట సుఖాలలో తోడుగా నిలిచిన నా సహధర్మచారిణి, నా ఆరో ప్రాణం నన్ను వదిలి వెళ్ళిపోయింది..... ఈ ముప్పది ఏళ్ళలో ఎన్నెన్ని జ్ఞాపకాలు, అన్నీ కూడా నిన్న మొన్న జరిగినట్టు చాలా తాజా గా ఉన్నాయి.... ఇన్నేళ్ళ నా జీవితంలో ఏ రోజు నేను క్యాలెండరు చూసింది గుర్తు లేదు.... అన్ని రోజులు నీ సహచర్యం లో ఒకేలా గడిచిపోయాయి..నీవు ఎన్నో సార్లు నాతో అనేదానివి నన్ను పొందిన నువ్వెంతో అదృష్టవంతురాలివి అని, కానీ అన్న ప్రతీసారి నీ మాటను కాదనలేక ఒప్పుకునేవాడిని కానీ, నా మనసుకు తెలుసు నిన్ను పొందిన నేను ఎంతో అదృష్టవంతుణ్ణి అని. తొలి సారి పెళ్లి చూపులలో నీ సిగ్గు పడే మొహాన్ని చూసిన నాటి నుండి... అసలు నీ మొహం చూడని రోజేదైనా ఉందా? ఏ రోజైనా మీ పుట్టింటి కి వెళ్ళినా కూడా సాయంత్రానికి మళ్ళీ వచ్చేసేదానివి. అదేంటి అంటే అది అంతే అనే దానివి. అలా అన్న ప్రతీసారి, నీ మొహంలో కనబడే ప్రేమ ఇప్పటికీ కూడా  ఆ క్షణం అలాగే ఉండిపోయి ఉంటె ఎంత బాగుండేది అనిపిస్తుంది.